‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకకు రాజకీయ రంగు.. కేటీఆర్ అందుకే రావట్లేదా..?

సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు ఎంతగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరో 15 రోజుల్లో సినిమా విడుదల కానుంది.


సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు ఎంతగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరో 15 రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 22న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా గ్రాండ్‌గా జరగబోతుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే ఈ వేడుకకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, అనుష్క, తమన్నా వంటి అగ్ర సినీ నటులు కూడా ఈ వేడుకకు వస్తున్నారని తెలుస్తుంది.


ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ముందు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వస్తాడని చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటాడని.. అందుకే రావడం లేదని తెలిపింది. కానీ అసలు కారణం మాత్రం అది కాదని.. రాజకీయ కారణంతోనే కేటీఆర్ ఈ వేడుకకు దూరంగా ఉంటూ వస్తున్నాడని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వస్తుండటంతోనే కేటీఆర్ దీనికి రావట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో వైసీపీకి వ్యతిరేకంగా పవన్ పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను ప్రతీసారి టార్గెట్ చేస్తూనే ఉన్నాడు పవన్.


మరోవైపు జగన్‌కు తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంది. దాంతో అక్కడే రాజకీయంగా విభేదాలు కనిపిస్తున్నాయి. అలాంటి వేడుకలో పవన్, కేటీఆర్ ఒకే వేదికపై ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే రాజకీయ కారణాలు చూపించకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయంటూ కేటీఆర్ ఈ వేడుకకు డుమ్మా కొడుతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి ఇందులో నిజాలెన్ని ఉన్నాయో తెలియదు కానీ రాజకీయంగా మాత్రం పవన్, కేటీఆర్ ఇప్పుడు భిన్నమైన పార్టీల్లో ఉన్నారనేది మాత్రం నిజం. అదే ఈ వేడుకపై కూడా ప్రభావం చూపిస్తుంది.